Skip to main content

Sree Bhuvaneswari Devi Temple శ్రీ భువనేశ్వరీ దేవి ఆలయం

Temple History

# The Temple Story

దశమహా విద్యల ఆవిర్భావము

విద్య అంటే తెలుసుకొనుట అని, తెలుసుకొను మార్గాన్ని చెప్పేదని అర్థం వస్తుంది. దశమహావిద్యలు అన్నీ గురుశిష్య పరంపరలో సాగుతాయి. ఇవి అన్నీ రహస్యంగా ఉంటాయి. ప్రసిద్ధమైన దశోపనిషత్తులలో అనేక విద్యలు ఉన్నాయి. అనేక రకాల ఉపాసనలు ఉన్నాయి. వీటిలో మధు విద్య,సంవర్గ విద్య వంటివి. వీటిని చదవడం తోనే సరిపెట్టుకోవలసి వస్తోంది. ఇట్టి విద్యల సాధన పూర్తిగా కనుమరుగై పోయింది. కానీ ఈ విద్యలే తంత్రాలలో మహావిద్యలుగా ఆవిర్భవించాయి.

దశమహావిద్యలు“.. కాళీ, తార, షోడశీ, భువనేశ్వరీ, త్రిపురభైరవి, చిన్నమస్త, ధూమావతి, బగళాముఖీ, మాతంగీ, కమలాత్మికలుగా చెప్పబడుచున్నవి. ఈ విద్యలు పదిగానే ఉండటం ఏమిటి అనే సందేహం రావచ్చు సాధకులకు. అలా సందేహ నివృత్తి కోసం ఈ వివరణాత్మక అంశం చదవగలరు.

అఖండ శక్తికి సృష్టి చేయాలనే సంకల్పం కలిగింది. ఆకాశ కాలాలను ఆలంబనగా చేసుకుంది అఖండ శక్తి. ఆకాశానికి అవధి (హద్దు) లేనందున పది దిక్కులలో అవతరించినట్లు ఉంటుంది. ఆ దిక్కులే అనంత శక్తిగా పది రూపాలను ధరించింది. అక్కడ ఏర్పడిన చైతన్యమనే జ్ఞానము పదిమార్గాలు ద్వారా కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కలిసి పదింటి ద్వారా మనకు చైతన్య విద్య అందుబాటులోకి వచ్చింది. ఆ విధంగా అనంత సత్యము చైతన్యము దశమహా రూపాలలో దశమహా విద్యల ద్వారా మనకు అవగతమౌతున్నది.

ఈ ధశమహావిద్యల ఆవిర్భావాన్ని ప్రాచీన గ్రంధాలను పురాణాలను పరికిస్తే కొన్ని సత్యాలు వెలుగులోకి వస్తున్నాయి. సతీదేవి యొక్క మహా భయంకరరూపాన్ని చూడలేక శివుడు వెళ్లిపోచుండగా అమ్మవారు పది విద్యల రూపాలను ధరించి శివుని అడ్డుకుని నిలబెట్టగలిగిందని భాగవతం తెలియ చేస్తున్నది.

దుర్గముడనే రాక్షనుడు వేదాలను దొంగలించగా దేవతలందరూ ఆ దుర్గముడిని నిలువరించలేక పోయిన సందర్భం లో అమ్మవారు పది రూపాలు ధరించి ఆ దుర్గముడిని సంహరించిందని ఈ సందర్భం లో పది విద్యలు ఆవిర్భవించాయని శివవురాణం ద్వారా తెలుసుకోవచ్చును.

దశమహా విద్యలు సాధకునికి భోగ మోక్షాలను రెంటినీ ప్రసాదించేవిగా ఉంటాయి. సాధకుడు చేసే కటోర సాధన పై వాటి ఫలితం ఉంటుంది. ఈ విద్యలలో ఏ విద్యకు ఆ విద్య సాటి అయినట్లు కనిపిస్తుంది. ఈ విద్యల లో గల తంత్ర ప్రత్యేకత ఏమంటే ప్రతి విద్య ద్వారా సాధకునికి ఒక్కొక్క కోరిక తీరుతూ సాధన యొక్క ఊర్ధ్వస్థానానికి సాధకుని తీసుకెళ్లి కోరిక లేని స్థితిని కలుగచేసి అమ్మ కృపకు మాత్రమే సిద్ది పొందడానికి సాధన మొదలెడతారు. ఈ విద్యలు ప్రసాదించే ఆత్మ సాక్షాత్కారము సాధకుని తీవ్రతను బట్టి ఉంటుంది. నియమ నిష్టలు కటోర సాధన పై ఆధారపడి ఉంటుంది. గురు భక్తి పైన మరియు గురువు నుండి పొందే జ్ఞానం పైనా ఈ సాధనలు సిద్ధి పొందడం ఆధారపడి ఉంటుంది. సాధనలో గురువు పెట్టె పరీక్షలు, గురువు సాధారణ స్థితి కి వచ్చి శిష్యుని పరికించినప్పుడు గురువు పట్ల చూపే శ్రద్ధ, గురువు ద్వారా గురువు కోసం వెచ్చించే ప్రతి క్షణం విలువైనదిగా భావిస్తూ గురుముఖతః విద్యను గురువు దగ్గర నుండి స్వీకరిస్తూ ఉండాలి. పుస్తకాల ద్వారా నేర్చుకునేది సిద్ధ విద్య మరియు దశమహా విద్య కాదని గుర్తెరగాలి. దశమహావిద్యలు సాధన చేయు సాధకులకు అనేక ఆటంకాలు ఎదురౌతాయి. సహజంగా ఉండే కామ క్రోధ, అహంకారములు ఎన్నో విధాలుగా ఆటంకపరుస్తాయి. ఈ జన్మలో చేసిన సాధన ఎక్కడికీ పోదు, మరుజన్మకు ఐనా విద్యను సిద్దించుకుంటామనే నమ్మకమే సాధకుని సమున్నతుడిగా తీర్చిదిద్దుతుంది. దశమహావిద్యల సాధనలో చేసినది ఏదీ వృధా కాదు. గత జన్మలో కొంతైనా చేసిన సాధన ఈ జన్మకు మోసుకువస్తే ఈ జన్మలో చేస్తున్న సాధన మరు జన్మ కు చేరుస్తుంది. కానీ ఈ జన్మకే సాధనలు సిద్దించుకున్నవారికి మణిదీపం నందు స్థానంలభిస్తుందనే నమ్మకంతో సాధకులు సాధనను చేయగలగాలి.

దశమహావిద్యలు ఒక పద్దతి ప్రకారము సమన్వయాన్ని ప్రసాదిస్తాయి. ఒక విద్య మరో విద్య సాధనకు మార్గం చూపిస్తుంది. కాళీ మాత ఎంత రౌద్రం గా ఉన్నా భద్రకాళీ గా కూడా ఉంటుంది. త్రిపుర సుందరి త్రిపుర భైరవి గాను ఉంటుంది. ఈ విద్య భయంకరంగాను ఉంటుంది అదే సమయంలో మంత్రిని గాను ఉంటుంది. త్రిపుర సుందరి యొక్క దండనాధ బగళాముఖీ, త్రిపుర సుందరి యొక్క మంత్రిణి గా మాతంగి దర్శనం ఇస్తుంది. కనుక త్రిపుర భైరవి సాధకులు మిగిలిన మాతంగీ బగళాముఖీ సాధనలను ఉపాసిస్తున్నట్లే అవగతం అవుతుంది.

దశమహావిద్యలలో కాళీ చిన్నమస్త ధూమావతి బగళాముఖీ ఒక కోవకు చెందినవి. ఇవి పరాక్రమ ప్రచ్చన్నశక్తి దశలకు చెందినవిగాను, సుందరి, భువనేశ్వరి, భైరవి, మాతంగి కమలాత్మిక విద్యలు సుందర రమణీయతలు, ఆకర్షణ శక్తులుగాను ఉంటాయి. నాదశక్తి పూర్వకంగా అయితే తారాదేవి కాళీ లక్షణాలతోనూ, భైరవీ బగళాముఖీ మాతంగీ లక్షణాలతో దర్శనం ఇస్తుంది.

ఋగ్వేదమునందలి చెప్పబడిన దేవతా శక్తులే దశమహా విద్యలు. అదితి, ఉషన్, మహి, రాత్రి, ఇడా, ఆథర్వ వేదమునందు చెప్పబడినట్లు ఆకూతి అనుమతి, జామి, గ్రాహి, రోహిణి, శచీ, ఇంద్రాణి, రాకా, ఆపొదేవీ, శ్రద్దా, సీతా, యామినీ, వైశ్వానరీ,వసుపత్ని, వరుణాని, వంటి స్త్రీ దేవతలను మనం నేరుగా కొలవకపోయినా వీరిని దశమహావిద్యాదేవతల రూపంలో కొలుస్తున్నాము. భగవతి, దేవి, సుభగా, అనవధ్య, సరూపంకరణీ, శివ, శక్తి, మాత, పయస్వతి, ఊర్జస్వతి, అజరా, విశ్వరూప, సుమన, సుమంగళి, జనిత్రి, ఆయుష్మతి, తప్యమాన, సంవిధాన, కృష్ణ, వీరవతి, పునీత, యశస్వతి, అపరాజిత, మహీయసి, పురాణి, మధుమతి, పరమేష్టిని, రోచమాస, అంబ, అమృత, దివ్య, వంటి ఈ నామాలతో వేద దేవతా స్త్రీలు కీర్తింపబడుచున్నారు. ఈ విద్యలన్నీ దశమహా విద్యలకు వర్తిస్తాయి. తరువాయి సంచిక నుండి దశమహా విద్యల యొక్క ఒక్కొ విద్యను తెలుసు కుందాము.

శ్రీ నాగేంద్ర ప్రసాద్ మహోదర శ్రీ భువనేశ్వరీ మాతా ప్రార్థనా కేంద్రం, కడప.